సిటీబ్యూరో, మే 18, (నమస్తే తెలంగాణ) : పురాతన భవనాలపై జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తోంది. ఏటా వర్షాకాలం ముందుగానే శిథిల భవనాలపై టౌన్ ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. శిథిల, ప్రమాదకరమైన భవనాల్లో ఉన్న నివాసితులను గుర్తించి..వారిని అక్కడిని నుంచి ఖాళీ చేయించేందుకు వారికి ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ బారికేడ్లను అమర్చాల్సి ఉంటుంది. వీటి పరిసర ప్రాంతాల్లోని నివాసితులు తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి ఉంటుంది.
కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు శిథిల భవనాలపై గుర్తింపు, గతంలో నోటీసులు ఇచ్చిన భవనాల పటిష్టత, మరమ్మతు పనుల అంశాలపై సమీక్షించిన దాఖలాలు లేవు. కనీసం సర్కిళ్ల వారీగా కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు లెక్క అధికారుల వద్ద లేదు. వచ్చేది వర్షాకాలం..ఇటీవల కుండపోత వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రమాదకర భవనాల పట్ల స్థానికులు, నివాసితుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఏదైన సంఘటన జరగకముందే అధికారులు అప్రమత్తమై శిథిల భవనాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
వానకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పాత భవనాల పటిష్టత , భద్రతపై ఇంజినీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన కట్టడాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే చేయాలి. ఈ డ్రైవ్‌లో భాగంగా పురాతన భవనాలపై జోన్ల వారీగా సర్వే చేసి..సంబంధిత భవన నాణ్యతపై పరిశీలించి.. ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేయడం, వాటిని కూల్చివేయడం వంటివి చేయాలి.
కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడలేదు. వాస్తవంగా గతేడాది లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 620 శిథిల భవనాలు ఉన్నాయి. ఎల్బీనగర్లో 113, చార్మినార్‌లో 89, ఖైరతాబాద్‌లో 109, సికింద్రాబాద్‌లో 155, శేరిలింగంపల్లిలో 62, కూకట్‌పల్లిలో 92 శిథిల భవనాలు ఉండగా..ఇప్పటి వరకు వాటి పరిస్థితులు ఏమిటో ఉన్నతాధికారులు ఆరా తీయలేదు. గతేడాది లాగే ఈసారి కూడా శిథిల భవనాల విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.