GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలిచిన సీఆర్ఎంపీ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేసీఆర్ పథకాలను ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ సర్కార్కు క్షేత్రస్థాయిలో అసాధ్యం కాదని తేలిపోయింది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పథకాల స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చి.. పాత ప్రతిపాదనలనే పట్టాలెక్కిస్తున్నది.
తాజాగా సీఆర్ఎంపీ పథకాన్ని తిరిగి కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఆర్ఎంపీ కింద రోడ్ల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేందుకుగానూ ప్రభుత్వ అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు సమర్పించింది. ఐతే సీఆర్ఎంపీ మొదటి విడుతతో పాటు రెండో విడుత పథకానికి మళ్లీ టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీలకు అప్పగించడమా? లేక పాత ఏజెన్సీలకు ఇవ్వడమా అని రెండు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది.
ఎల్లవేళలా సాఫీగా ప్రయాణానికి అనువుగా ఉండాలి.. ఇది కాంప్రెహెన్సిన్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) లక్ష్యం..ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి తొలి విడుతగా 744.220 కిలోమీటర్ల రహదారిని 2020 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. నిర్ణీత గడువులో మొదటి విడుతను పూర్తి చేసి గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దింది. ఈ సీఆర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం చేపట్టక పోవడంపై విమర్శలు వచ్చాయి.
కొన్ని నెలలుగా ప్రైవేట్ ఏజెన్సీలను పక్కన పెట్టి స్వంతంగా జీహెచ్ఎంసీ నిర్వహణ చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే మొదటి విడుత పథకం నిర్వహణను మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో పాటు కొత్తగా రెండో విడుతలో రూ. 424 చోట్లకుగానూ 398.32 కిలోమీటర్ల మేరలో రూ.1334 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు విడుతలు కలిపి 934 ప్రాంతాల్లో 1142.54 కిలోమీటర్ల మేరలో రూ.3825 కిలోమీటర్లలో సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు.