సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 22 (నమస్తే తెలంగాణ): ‘యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్… ఇది నిన్నటి మాట.. ‘ఓన్లీ ట్యాక్స్… నో వర్క్స్’… ఇది ప్రస్తుతం జీహెచ్ఎంసీ బాట.. అవును గ్రేటర్లో మౌలిక వసతుల కల్పన పట్ల బల్దియా శీతకన్ను చూపిస్తున్నది. ఒక డివిజన్లో రహదారుల మరమ్మతులు… ఇంకో డివిజన్లో డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు… మరో డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం… ఇలా సగటు నగరవాసికి మౌలిక వసతులు కల్పించేందుకు రూపొందించిన రూ.221.73 కోట్ల విలువైన ప్రత్యేక మౌలిక వసతుల గ్రాంట్ (ఎస్ఐజీ) పనులను తాజాగా రద్దు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల కిందట అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల లేమి,… గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన పనులే కారణమో..ఉత్తర్వుల్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గ్రేటర్‌లోని 150 డివిజన్ల పరిధిలో టెండర్లు పూర్తయి మొదలుకాని, టెండర్ల దశలోని, ప్రతిపాదనలో ఉన్న… ఇలా మూడు రకాలైన 756 పెండింగ్ పనులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అసలే రానున్నది వర్షాకాలం. ఈ సమయంలో మౌలిక వసతులకు సంబంధించిన ఈ పనులను రద్దు చేయడంతో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేది సుస్పష్టం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.6,600 కోట్లు. ఇందులో ప్రధానంగా ప్రజల నుంచి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం రూ.3500-4000 కోట్ల వరకు ఉంటుంది. ఏటా సుమారు రూ.2100 కోట్ల వరకు కేవలం ఆస్తి పన్ను రూపంలోనే గ్రేటర్ ఖజానాకు చేరుతుంది. ఇటీవల ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ. 950 కోట్లు వసూలయ్యాయి. ఇంటి నిర్మాణ అనుమతులు, డెవలప్మెంట్ చార్జీలు ఇలా రూ.1200 కోట్ల వరకు వస్తాయి. లీజులు, ఇతరత్రా రూ.300-400 కోట్ల వరకు సమకూరుతాయి. మరి… ప్రజల నుంచి ఇంత భారీస్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న బల్దియా.. నగరంలో ప్రజా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వందలాది పనులను ఒకేసారి రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఏ ప్రభుత్వం వచ్చినా… పార్టీలు మారినా… స్థానిక సంస్థలు అందునా జీహెచ్ఎంసీకి సంబంధించిన అభివృద్ధి పనులు, విధానాలు అనేవి ప్రజా కోణంలోనే సాధారణంగా జరిగిపోతుంటాయి. రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ సంబంధిత పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల నిర్మాణం ఇలా ఇవన్నీ ప్రాథమికంగా జీహెచ్ఎంసీ చేపట్టాల్సినవి. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక మౌలిక వసతుల గ్రాంట్ (ఎస్ఐజీ) కింద 150 డివిజన్ల పరిధిలో 756 అభివృద్ధి పనులను రూపొందించారు. కాలానుగుణంగా వీటిలో కొన్ని ప్రతిపాదనలు పూర్తికాగా, మరికొన్ని టెండర్ల దశలోకి, ఇంకొన్ని టెండర్ల పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో తమ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి త్వరలో పనులు జరుగుతాయని నగరవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నెల 20న జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ 756 పనులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారే తప్ప.. ఫలానా కారణంతో రద్దు చేశామని స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో రద్దు వెనక కారణాలపై అనేక రకాల ప్రచారం జరుగుతున్నది.
ఈ పనుల రద్దు వెనక ఖజానాలో కాసులు లేకపోవడమే ప్రధాన కారణమని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ.1400 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. దీంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి, సమ్మె చేపట్టారు. తాజాగా రద్దు చేసిన పనుల్లో టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే పరిస్థితి కూడా లేదని అధికారి ఒకరు తెలిపారు. అందుకే నిధులలేమితో పనులు రద్దు చేసినట్లు చెబుతున్నారు. అయితే భారీ ప్రాజెక్టు పనులు కొన్నిరోజులు పెండింగ్‌లో ఉన్నా ప్రజా జీవనంపై పెద్ద ప్రభావం ఉండదు. కానీ కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో అత్యవసర పనులను పెండింగ్‌లో పెట్టడం మంచిది కాదని పలువురు వాపోతున్నారు. కానీ అధికారులు మొదలుకాని (పెండింగ్) పనులన్నింటినీ ఒకేగాడిన కట్టి రద్దు చేయడంతో ప్రజల సమస్యల పరిష్కారం అటకెక్కినట్లేనని అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన.. తాలూకు పరిణామాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు రూపొందించిన ఈ పనులను రద్దు చేసి ఉంటారా? అనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా రేవంత్ సర్కారు కొలువుదీరిన తర్వాత నగరంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ), వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) వంటి కీలకమైన ప్రాజెక్టుల పనులు మందగించాయి. అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హైదరాబాద్‌ను విశ్వ నగరంగా కీర్తించడంలో ఈ ప్రాజెక్టుల పనులే కీలకంగా మారాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీల వంటి నిర్మాణ పనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే క్రమంలో తాజాగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు కూడా రద్దు చేయడంతో దీనికి కూడా అదే కారణమా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.