సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇతర వాటిల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు మలక్‌పేట, శివాలయ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
వీధి వ్యాపారులే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు మలక్‌పేటలోని ఈశ్వర్ ట్రేడర్స్, విజయ సాయి బాయ్స్ హాస్టల్, బేగంబజార్‌లోని ఆకాశ్ ట్రెడింగ్ కంపెనీ, చంద్రా ఏజెన్సీ, పేట్ బషీరాబాద్‌లోని కాంచి కేఫ్, విజిటిలింగ్ రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టి.. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు తేల్చారు. వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.