సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పౌరులపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత కొనసాగిస్తున్నది. రోడ్లు, ఖాళీల స్థలాల్లో ఇష్టారీతిన చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానాలను విధిస్తున్నది. దీంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టగుట్టలుగా రహదారుల వెంబడి, చెరువులు, నాలాల వెంబడి పారబోస్తున్న వారిని లక్ష్యంగా చలాన్లు విధిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల నుంచి రెండు రూపాయల వరకు జరిమానాలు విధిస్తున్నది.
సర్కిల్ స్థాయి అధికారులు వివిధ వ్యాపారస్తులు, దుకాణాదారులే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. చెత్తకు సంబంధించి ఏఎంవోహెచ్లు, భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీలు చలాన్లు జనరేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్ల మీద చెత్త వేసినందుకు ఇప్పటి వరకు సీసీఎంఎస్ ద్వారా రూ. 69.22 లక్షల జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. 30 సర్కిళ్ల పరిధిలో 3,944 చలాన్లు జారీ చేయగా రూ. 69,22,200ల జరిమానాలు విధించారు.
ఇందులో 2,535 మంది పెనాల్టీలు కట్టగా..రూ. 25.89 లక్షల ఆదాయం ఖజానాకు చేరింది. 1409 చలాన్లకు సంబంధించి రూ. 43.20 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. సరాసరిగా ఒక్క రోజులో లక్ష వరకు పెనాల్టీలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ వేసిన వారిని గుర్తించి వారిపై చలాన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే 30 సర్కిళ్లలో 537 చలాన్లు జారీ చేయగా, రూ.48 లక్షల జరిమానాలు విధించారు. 221 చలాన్లకు రూ.13.95 లక్షల జరిమానాలు వసూలు అయ్యాయి. 316 మంది నుంచి రూ.34.05 లక్షల మేర వసూలు కావాల్సి ఉంది.
ఇంటింటి చెత్త సేకరణ ఏదీ?
స్పెషల్ డ్రైవ్లు పెట్టి జరిమానాల విధిస్తున్నారు సరే.. ఇంటింటి చెత్త సేకరణలో ఎందుకు నిర్వహణ సరిగా చేపట్టడం లేదంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్బేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) ఎత్తివేతలో అధికారుల వైఫల్యం చెందుతున్నారు. స్వచ్ఛ ఆటోల పనితీరుపై పర్యవేక్షణ లేదు. ఇంట్లో వ్యర్థాలు పేరుకుపోతుండడం, దోమల విజృంభణ వెరసి తప్పని పరిస్థితుల్లో కవర్లో పెట్టి జీపీపీ పాయింట్ల వద్ద చెత్త వేస్తున్నామని, జంతు వ్యర్థాలను వేసే దుకాణాలను వదిలి చిన్న చిన్న వారిపై జీహెచ్ఎంసీ ప్రతాపం చూపిస్తున్నదని పలువురు గృహిణులు మండిపడుతున్నారు.