సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బల్దియాకు కొత్త బాసులొచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న రొనాల్డ్‌రాస్‌ను ట్రాన్స్‌కో, జెఎన్‌కో సీఎండీగా నియమించారు. గడిచిన 15 రోజులుగా రొనాల్డ్‌రాస్ సెలవుపై ఉండటంతో ఇన్చార్జిగా ఆమ్రపాలి కొనసాగగా.. తాజా బదిలీల్లో ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు మూడు కీలక జోనల్ కార్యాలయాల్లో ఐఏఎస్ అధికారులను నియమించారు.
హేమంత్ కేశవ పాటిల్‌ను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా, అపూర్వ్ చౌహాన్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా, అనురాగ్ జ్యోతిని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా నియమించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా కొనసాగిన పంకజకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ (ఐటీ, రెవెన్యూ)తో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న స్నేహ శబరీష్‌ను అదనపు కమిషనర్‌కే పరిమితం చేశారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్(శానిటేషన్ విభాగం)గా ఉన్న ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. కాగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం డైరెక్టర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డిని టూరిజం ఎండీగా నియమించారు. ఈ స్థానంలో ఏవీ రంగనాథ్‌కు జీహెచ్ఎంసీ విజిలెన్స్, విపత్తు నిర్వహణ (ఈవీడీఎం) డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. మూడు విభాగాలుగా డీఆర్ఎఫ్ను విభజించి ఎస్పీ స్థాయి అధికారులతో రంగనాథ్ పర్యవేక్షణలో భవిష్యత్తులో ఈవీడీఎం సేవలు అందించనున్నది.
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా కె.అశోక్‌రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం ఎండీగా కొనసాగిన సుదర్శన్‌రెడ్డిని జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. సుదర్శన్ రెడ్డి గత డిసెంబర్ రెండోవారంలో జలమండలి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ, కృష్ణా జలాల ఎమర్జెన్సీ పంపింగ్, ట్యాంకర్ల సరఫరాలో వినూత్న విధానాలను తీసుకువచ్చిన సుదర్శన్ రెడ్డి నీటి కొరతను అధిగమించడంలో విశేషంగా కృషి చేశారు. గతంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా అశోక్‌రెడ్డి కొనసాగారు. ఈడీగా కొనసాగిన అశోక్‌రెడ్డి గ్రేటర్ ప్రజలకు సేవలందించే కీలక శాఖకు ఎండీగా ఏ మేర తన ముద్ర వేసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే!
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 24 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) అభిషేక్ అగస్త్య బదిలీ అయ్యారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆయనను బదిలీ చేశారు.