Ronald Ross | సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగపడేలా ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. వర్షపు నీటిని ఏ మాత్రం వృథా చేయకుండా భూగర్భజలాలను పెంపొందించేలా ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడంతో పాటు వాటి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించి.. భూగర్భ జలాలను పెంపొందించే దిశగా జీహెచ్ఎంసీ పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు.
కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్లంబింగ్ వర్కర్లు, మేస్త్రీలకు నగరంలో నీటి సమస్యలు రాకుండా చూడటం, తగిన పరిష్కారం, వర్షపు నీటి సంరక్షించుకోవడం, భూగర్భ జలాలు పెరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి అందుబాటులోకి వచ్చిన వినూత్న విధానాలను వివరించారు. ఈ సందర్భ ంగా ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్టు సీఈవో కల్పనా రమేశ్ నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు.
ఈ నెల 24, 25వ తేదీల్లో కూడా వర్షపు నీటి సంరక్షణపై ప్లంబింగ్ నిపుణులకు శిక్షణ నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు గూగుల్ ఫారం https://forms.gle/rJnheoVKSEU4VDnJA లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణానంతరం ప్లంబర్ వర్కర్లు, మేస్త్రీలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ (యూసీడీ) వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్లో భూగర్భ జలాల్ని పెంచేందుకు జలమండలి, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్లంబర్స్, మేస్త్రీలకు సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులు (22,23,24వ తేదీలు) ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాననీటి సంరక్షణలో ఇంకుడు గుంతల నిర్మాణం ఎంతో ముఖ్యమని ఎండీ సుదర్శన్‌రెడ్డి అన్నారు, ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 86396 19366 ఫోన్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.