ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ పనులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మాణంలో ఉన్న శిల్పా లే అవుట్ ఫేస్ -2 ఫ్లై ఓవర్, ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నదని ఇంజినీరింగ్ అధికారులు వివరించగా, వెంటనే విద్యుత్ లైన్ తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
33 కేవీ విద్యుత్ లైన్ తొలగించకపోవడంతో శిల్పా లే అవుట్ ఫేస్-2 పనులు స్ట్రామ్ వాటర్ డ్రైన్/కల్వర్టులు, ర్యాంపు (ఆర్ఈ) పనులు చేపట్టలేకపోయామని అధికారులు కమిషనర్‌కు వివరించారు. దీంతో ఆయన విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించాలని, టీజీఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఫ్లై ఓవర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కమిషనర్ వెంట ప్రాజెక్టు సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి, వెంకన్న, డిప్యూటీ ఈఈ హరీశ్ తదితరులు ఉన్నారు.