సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్ కార్పొరేట్ భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు భవన కూల్చివేతకు సంబంధించిరూ.33.86 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేసిన అధికారులు..షార్ట్ టెండర్‌ను ఆహ్వానించారు. బుధవారం(నేడు) ఉదయం 10. 30 గంటల వరకు బిడ్లు దాఖలుకు టెండర్ గడువు విధించారు. నిబంధనలకు అనుగుణంగా ముందుకు వచ్చిన ఏజెన్సీని ఎంపిక చేసి సదరు భవన కూల్చివేత ప్రక్రియను బుధవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఐతే భవనంలో మరో రెండు మృతదేహాలకు సంబంధించి స్పష్టత రాకపోవడం..తుది నివేదికను పరిగణనలోకి తీసుకుని కూల్చివేత ప్రారంభం కానుంది. ఈ మధ్య సమయంలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి భవనాన్ని కూల్చివేసే అన్నీ చర్యలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. ఐతే కూల్చివేతలో భాగంగా పక్కనున్న నిర్మాణాలు దెబ్బ తినకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేయాలని నిర్ణయించారు. ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం ఈ యంత్రం ప్రత్యేకత. కాగా, ఖర్చు చేసిన నగదును భవన యాజమాని నుంచి రికవరీ చేస్తామని అధికారులు తెలిపారు.
నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు బీఆర్కె భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. గ్రేటర్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, పురాతన భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. డెక్కన్ భవనం అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.