GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రకటన విభాగం ముఖ్యమైనది… అడ్వర్టయిజ్మెంట్ రూపంలో రూ.వంద కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ సరైన ఆదాయం ఎందుకు రావడం లేదు? ఖజానాకు చేరాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న ఇంటిదొంగలేవరూ? అక్రమ హోర్డింగ్‌ల నియంత్రణలో ఎందుకీ నిర్లక్ష్యం? ఒకరిద్దరి ఏజెన్సీలకే ధారాదత్తం చేస్తున్నారా? ప్రకటన విభాగాన్ని ప్రక్షాళన ఎందుకు చేయడం లేదు? ప్రకటన విభాగంలో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన హౌస్ కమిటీని నీరుగార్చింది ఎవరూ? ప్రభుత్వంలోని కొందరి పెద్దల సహకారంతో ఈ విభాగం నడుస్తుందా? ఇలా ప్రకటనల విభాగంపై వస్తున్న అనేక విమర్శలు జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారాయి.
ఇందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల రూపంలో రూ. 60కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటే….గతేడాది 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.32.88కోట్లు మాత్రమే ఆదాయం రావడంతో ఈ చర్చకు దారితీసింది. ఆదాయం రూ.27కోట్లకు పైగా తగ్గడంలో కమిషనర్ దృష్టి సారించి విభాగాన్ని సమూల ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఏ స్థాయిలో ఉందో కౌన్సిల్ వేదికగా కార్పొరేటర్లు మండిపడిన సంగతి తెలిసిందే. ప్రకటన విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నదని, జీహెచ్ఎంసీకి రావాల్సిన అడ్వర్టయిజ్మెంట్ ట్యాక్స్ కోట్లాది రూపాయలను కొందరు అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, అక్రమ హోర్డింగ్స్లు , మాల్స్‌లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసిన వారు ‘కార్తిక్’ ట్యాక్స్ చెల్లిస్తున్నారంటూ ఆరోపించారు.
వందల కోట్లు రావాల్సిన చోట కేవలం రూ.20కోట్లు మాత్రమే వస్తుండడం పట్ల కార్పొరేటర్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ తరుణంలోనే అక్రమాల నిగ్గు తేల్చేందుకు హౌస్ కమిటీని మేయర్ ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు సార్లు హడావుడి చేసిన ఈ కమిటీ.. ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది.