
సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ)/మాదాపూర్ : ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడిన ఆరేళ్లలోనే పట్టణాభివృద్ధి అద్భుతమని, రాష్ట్రంలో అభివృద్ధి ఎంతో గణనీయంగా జరిగిందని, 2015లో 78 పట్టణ ప్రాంతాలుండగా, ప్రస్తుతం, 142 పట్టణ ప్రాంతాలు ఏర్పాటయ్యాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, ఎన్ఐయూఎం డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్ అన్నారు. హెచ్ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన హైసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన వృద్ధి సాధించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలు, ప్రవేశపెట్టిన పథకాలు, శాంతిభద్రతలు ఎంతో దోహదం చేశాయన్నారు.
పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన పాలసీలను తీసుకురావడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులొచ్చాయి. ఏప్రాంతం వారైనా ఇక్కడ హాయి గా, ఉన్నత స్థాయిలో ఉండేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో బొగ్గు కొరతతో విద్యు త్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపినా, తెలంగాణ రాష్ట్రం లో ఆ పరిస్థితి లేదన్నారు.
మహింద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈఓ సుమన్ మిశ్రా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌లో ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నామని తెలిపారు. హైసియా అధ్యక్షులు భరణి ఆరోల్ మాట్లాడుతూ.. నగరంలో గ్రీన్ ఎనర్జీ విషయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
హైసియా, సీబీఆర్ఈలు హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై రూపొందించిన శ్వేత పత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. ‘ది నెక్ట్ నార్మల్-రీ ఇమాజినింగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్’ అనే పేరుతో రూపొందించిన పత్రాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి, ఎన్ఐయూఎం డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మెన్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్య్రూ ఫ్లేమింగ్, ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి,ఫస్ట్ సోర్స్ కంపెనీ అధ్యక్షులు, సీఓఓ ప్రశాంత్ నందెళ్ల, రీసైకిల్ మ్యాన్ ఇండియా డాక్టర్ బినిష్ దేశాయ్‌లతో పాటు పలు ప్రముఖ ఐటీ, ఐటీఈఎస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.