
సిటీబ్యూరో, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): మహా నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పురాతన, శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలకు సంబంధించి యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ భవనాలను ఖాళీ చేయకపోవడంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఖాళీ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వానాకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత, భద్రతపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ ఏడాది వేసవిలోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 610 శిథిల భవనాలు ఉన్నాయని గుర్తించి ఇప్పటి వరకు 180 శిథిల భవనాలను కూల్చివేశారు. 67 చోట్ల భవనాలకు మరమ్మతులు, సీజ్ చేయడం లాంటివి చేశారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు ఆయా భవనాల చుట్టూ భారీ కేడ్లను అమర్చుతున్నారు. ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉన్నందున ఈ భవనాల పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.