
సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తాగు నీటి ట్యాంకర్లు పంపాలన్నారు.
మ్యాన్ హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జలమండలి, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పరిశీలించాలని, అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయాలని సూచించారు. ప్రధానంగా, జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్ర త్తలు తీసుకుంటున్నట్లు ఎండీ వివరించారు. ఇందుకోసం మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవ లంభిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా.. ఇండ్లలో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడం కోసం ప్రజలకు క్లోరిన్ బిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎకడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా వెంటనే జలమండలి కస్టమర్ కేర్ 155313కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సంబంధిత ప్రాంతానికి వెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేకంగా 334 మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు నమోదైన సమస్యలను పరిష్కరిస్తున్నారు. వర్ష సంబంధిత సమస్యలుంటే 040-2111 1111కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.