
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల ఒకటో తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున జీహెచ్ఎంసీ యంత్రాంగం పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నది. గ్రేటర్ పరిధిలో సుమారు 2,173 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రభుత్వాదేశానుసారం వీటన్నింటిలో కరోనా జాగ్రత్తలతో పాటు ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో దోమల బెడద తీవ్రమై.. సీజనల్ వ్యాధులు పెరిగే ప్రమాదమున్నందున ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా దోమల నివారణకుగాను ఫాగింగ్, శానిటైజేషన్ చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 81 శాతానికి పైగా పనులు పూర్తికాగా.. మిగిలిన వాటిలోనూ ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రముఖులు, అధికారులు ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాల పాటు డ్రై డే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన పాఠశాలలు తెరచుకోనున్నందున పాఠశాలల్లో దోమల బెడద లేకుండా దోమల ఆవాసాలను గుర్తించి, వాటిని నిర్మూలిస్తున్నారు.