
ఇల్లు లేదా దుకాణం, వాణిజ్య సముదాయం ఖాళీ ఉందని దాని యజమాని టులెట్ బోర్డు పెట్టుకుంటే అభ్యంతరం లేదని, అలాంటి బోర్డులకు ఎలాంటి జరిమానా విధించమని జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం స్పష్టం చేసింది. అద్దెల పేరుతో వ్యాపారం చేసే సంస్థలు (బ్రోకర్లు) అనుమతి లేకుండా ఇష్టానుసారం బ్యానర్లు, వాల్‌పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేస్తే వాటికి జరిమానా విధిస్తామని వెల్లడించింది. వీరిది వ్యాపార కేటగిరీలోకి వస్తుందని, నగర సుందరీకరణకు విఘాతం కలిగించొద్దనే ఉద్దేశంతోనే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, ఫ్లెక్సీలు పెట్టినా, వాల్‌పోస్టర్లు అంటించినా వాటిని ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నామని వివరించింది. వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేయడంపై సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి ఈ-చలాన్లు జారీ చేస్తున్నామని, వస్తున్న ఫిర్యాదుల్లో పెద్ద మొత్తంలో టులెట్ బోర్డులు, పాన్‌కార్డు, జీఎస్టీ, వాంటెడ్, ఫ్లాట్ సేల్స్ వంటివి ఉన్నట్లు గుర్తించామని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అంటించిన సంస్థలకు జరిమానా విధిస్తామని ఈవీడీఎం అధికారులు వివరణ ఇచ్చారు.