
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో నిర్వహణ పనులు మరింత పకడ్బందీగా జరగనున్నాయి. టెండర్ నిబంధనలకు తిలోకాలిస్తూ పనుల నిర్వహణలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. చేసే ప్రతి పని పారదర్శకంగా నిర్వహించడంతో పాటు నిర్ణీత సమయంలో సంబంధిత వర్క్‌ను పూర్తి చేసే దిశగా, నిత్యం ఆన్లైన్ పర్యవేక్షణలో ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక నుంచి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి పని పూర్తి చేసే వరకు ప్రతిదీ ఆన్లైన్లో జరగనుంది.
ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్‌కు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడం, టెండర్ నిబంధనల ప్రకారం సకాలంలో పని పూర్తి చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పన చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ఆన్లైన్ విధానం అందుబాటులోకి తీసుకువస్తామని ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటి వరకు వర్క్ ఆర్డర్ తీసుకున్న కాంట్రాక్టర్ క్షేత్రస్థాయిలో కుంటిసాకులు చెబుతూ వర్క్‌ను ఆలస్యం చేసేందుకు ఆస్కారం ఉండేది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులను ముప్పుతిప్పలు పెడుతూ నెలల తరబడి పనులను నిర్వహించేవారు.
కానీ ఇక మీదట పనుల నిర్వహణ జోనల్ పరిధిలోని క్షేత్రస్థాయి నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు పురోగతిలో ఉన్న పనులను పర్యవేక్షించి తగు సమయంలో పనులు పూర్తి చేసేలా ఈ విధానం దోహదపడనుంది. అప్పటికీ నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్‌పై జరిమానా, లైసెన్స్ రద్దు లాంటి చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా దాదాపు రూ. 550కోట్ల మేర నిర్వహణ పనులు జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్ ఆధునీకరణ, ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి, సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ, నాలాల అభివృద్ధి, పూడికతీత, మ్యాన్‌హోల్స్ నిర్వహణ ఇలా పలు రకాల పనులు జరుగుతున్నాయి.