
సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ )/బేగంపేట్ : దోమల నియంత్రణ మన చేతిలోనే ఉన్నదని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్నాయక్ పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ దినం సందర్భంగా బేగంపేట సర్కిల్ వెంగళ్రావునగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దోమల నివారణ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్ నాయక్, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ మన చేతిలోనే ఉన్నదని సంతోష్ నాయక్ అన్నారు. దోమల నియంత్రణ, దోమ పిల్లలు పెట్టకుండా, అవి కుట్టకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వలను ఖాళీ చేయాలని సూచించారు. దోమ పిల్లలను తినే గంబూసియా చేపలను పెంచి, దోమలను అదుపు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.