
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ) : నకిలీ ఓటర్లకు అడ్డుకట్ట వేసే ప్రక్రియకు అడుగులు పడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను, సర్వర్ సామర్థ్యాన్ని పరీక్షించే కార్యక్రమం శనివారం జరుగనున్నది. జనవరి 2020 అనంతరం ఓటరుగా నమోదైన వారంతా ఈ నయా విధానంలో పాల్గొనేందుకు అర్హులుగా ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 25వేల మంది ఓటర్లను 2020 జనవరి అనంతరం ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరంతా శనివారం (14వ తేదీన) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ‘ఓటరు హెల్ప్‌లైన్’ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ -ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా జరుగనున్న ఈ కార్యక్రమంతో ఒకేసారి ఎంత మందికి ఓటరు కార్డులను సమస్య లేకుండా అందించగలమనే అంశంపై ఈ కార్యక్రమంలో స్పష్టత రానున్నది. మొబైల్ నంబరు ఆధారంగా ఓటర్లు ఈ-ఎపిక్ కార్డులను పొందగలరని, డిజిటల్ రూపంలో పొందిన గుర్తింపు కార్డులను పౌరులు నేరుగా ముద్రించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఫోన్ నంబరు సాయంతో ఓటరు కార్డులను అందించే ప్రక్రియ నిర్ధేశించిన సమయంలో విజయవంతమైతే నకిలీ ఓటరు కార్డుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.