
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ ) : నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్నింటినీ సంబంధిత కార్పొరేటర్లకు అందజేసి ఆయా అభివృద్ధి కార్యక్రమాల సత్వర పురోగతికి వారిని భాగస్వామ్యం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్బీనగర్ , సరూర్నగర్, హయత్నగర్ సర్కిళ్లలో జరుగుతున్న నాలా విస్తరణ, వరద ముంపు నివారణ పనుల పురోగతిపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితర అధికారులు, కార్పొరేటర్లతో మంగళవారం మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువ నష్టం వాటిల్లిందని మేయర్ తెలిపారు. ఈ సారి వర్షాల వల్ల తిరిగి నష్టం వాటిల్లకుండా ఉండేందుకై పలు నాలాల అభివృద్ధి, బాక్స్ డ్రైయిన్ల నిర్మాణం, చెరువులకు తూముల నిర్మాణం, నాలాల పూడిక తీత పనులు తదితర ముందస్తు చర్యలను చేపట్టామని అధికారులు వివరించారు. ఇప్పటికే ఎల్బీ నగర్, సరూర్నగర్, హయత్నగర్ సర్కిళ్లలో కొనసాగుతున్న పనుల వివరాలను సంబంధిత కార్పొరేటర్లకు అందజేసి, ఆ పనులను సకాలంలో పూర్తి చేయడానికి వారి సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఎల్బీనగర్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని తెలిపారు.