
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ):గ్రేటర్ పరిధిలోని వరద నీటి నాలాలను సమగ్రంగా అభివృద్ధి చేసే చర్యల్లో ముందడుగు పడింది. నాలాల మీద ఆక్రమణలు తొలగించడం సాధ్యపడట్లేదు. అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేసేందుకు చట్టబద్దమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆక్రమణలు తొలగించి నిరాశ్రయులకు డబుల్ బెడ్ ర్రూం ఇండ్లు కేటాయిస్తామన్నా.. ముందుకు రావడం లేదు. దీంతో నాలాలను అభివృద్ధి చేసే సమయంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నాలాలను బృహత్తర ప్రణాళికలో చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆరు జోన్లలో తొలుత ఒక్కో నాలాను ఎంపిక చేసి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగానే కూకట్పల్లి, ఎల్బీనగర్ జోన్లలోని నాలాలకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించినట్లు సమాచారం. మరో నాలుగు జోన్లకు సంబంధించి ఈ వారంలో పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఓయంట్స్ కమిటీ చెప్పిన కొలతల ప్రకారం నాలాలను చేర్చితే సంబంధిత నాలాలన్నీ అధికారికంగా అభివృద్ధి జరుగుతాయి. పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు ఆస్కారం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాల్లేని ప్రభుత్వ ఆస్తులుగా బృహత్తర ప్రణాళికలో ఇమిడిపోతాయి. త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న అన్ని నాలాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చనున్నామని పేర్కొన్నారు.