Shamshabad | శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరారు.
పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. గ్రామస్తులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ప్రత్యేకాధికారి వాల్యానాయక్ కలిసి మున్సిపాలిటీలో విలీనం కోసం తీర్మానం పత్రాలను ఉన్నతాధికారులకు అందించారిన ఆరోపించారు. వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
అనంతరం గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి వరకు ర్యాలీ చేసి, రోడ్డుపై ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పంపించారు. కార్యక్రమంలో జగన్‌గౌడ్, రాంనాథ్ ముదిరాజ్, ఆనంద్ ముదిరాజ్, ఇమ్రాన్, రవీందర్ గౌడ్, మల్లేశ్ గౌడ్ నందం, రాజు, లాలప్ప, సురేశ్ గౌడ్, సిద్ధయ్య, ప్రభూ, అభీబ్, గఫార్, కిట్టు ముదిరాజ్తో పాటు మహిళలు పాల్గొన్నారు.