సికింద్రాబాద్, మే 6: మాదక ద్రవ్యాల అలవాటు సరదాతో ప్రారంభమై జీవితాన్ని నాశనం చేస్తుందని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీమోహన్ పేర్కొన్నారు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కంటోన్మెంట్‌లోని అక్షర వాగ్ధేవి ఇంటర్నేషనల్ స్కూల్లో మాదక ద్రవ్యాల కట్టడిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి బేగంపేట్ ఏసీపీ నరేష్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది సురేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో యువత లక్ష్యంగా మారుతోందని, దీనికి అలవాటు పడితే నేరమయమైన జీవితానికి దారితీస్తుందన్నారు. అనంతరం ఏసీపీ నరేష్‌రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. అవసరమైతే మెసేజ్ రూపంలో తెలియజేయవచ్చని అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పాఠశాల ప్రతినిధి పీఎల్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.