మేడ్చల్, మార్చి26 (నమస్తే తెలంగాణ): ఇంధన ఇక్కట్లతో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కుదేలవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాలనగర్, చర్లపల్లి, నాచారం, ఉప్పల్, మల్లాపూర్, కూకట్పల్లి, మౌలాలి, శామీర్‌పేట్, మేడ్చల్, జీడిమెట్ల పారిశ్రామికవాడలలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు దాదాపు వెయ్యికి పైగా ఉన్నట్లు పరిశ్రమలశాఖ అధికారుల అంచనా. పశ్చియాసియా యుద్ధం కొనసాగుతున్న క్రమంలో గ్యాస్ షార్టేజ్ ప్రభావం ఇక్కడి పరిశ్రమలపై పడుతుంది.
ముడిసరుకు సరఫరా సరిగా కాకపోవడంతో గ్యాస్ ఆధారిత ఫుడ్, ఇంజనీరింగ్ పరిశ్రమలలో ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఇదే అదనుగా బ్యాక్ మార్కెట్లో ముడిసరకుల ధరలను పెంచడం పరిశ్రమల యజమానులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని పరిశ్రమలలో వివిధ అవసరాల కోసం పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం వీటి లభ్యత తగ్గిపోవడంతో ఆయా పరిశ్రమలకు ఇబ్బందికరంగా మారింది.
జిల్లాలో వెయ్యికి పైగా ఉన్న గ్యాస్ ఆధారిత పరిశ్రమలకు వాణిజ్య సిలిండర్ల కొరత త్రీవమైంది. వివిధ పరిశ్రమల ఉత్పత్తులకు గ్యాస్‌తో పాటు అమ్మెనియా గ్యాస్ సిలిండర్లు అవసరం ఉంటుంది. అలాగే మిథనాల్ ధరలను పెంచడంతో పాటు నో స్టోక్ బోర్డులు దర్శమిస్తున్నట్లు పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే ముడిసరకులు లభించకపోవడంతో దీంతో పరిశ్రమలలో ఉత్పత్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే మాత్రం పరిశ్రమలు మూతపడక తప్పకపోవచ్చన ఆందోళన పరిశ్రమల యజమానులలో వ్యక్తం అవుతుంది.