GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఘన వ్యర్థాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. ఒక వైపు గ్రేటర్ నలుమూలల నుంచి రోజూ సగటున 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనికి తోడుగా నాలాల నుంచి వెలికితీసిన సిల్ట్(పూడిక)కు తోడుగా భవన నిర్మాణ వ్యర్థాలను సైతం ఈ డంపింగ్కే తరలిస్తుండడంతో ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రతిఏటా నాలాల్లోంచి తీసిన సిల్ట్‌ను కూడా తరలిస్తుండడంతో ఇకపై అలా కుదరదని సంబంధిత నిర్వహణ విభాగం ఇంజినీర్లకు స్పష్టం చేశారు.
ఇప్పటికే అక్కడ పేరుకుపోయిన చెత్తతో ల్యాండ్‌ఫిల్ స్థలం లేకుండా పోతున్నదని, దానికి తోడు సిల్ట్‌ను కూడా అక్కడికే తరలిస్తే సమస్యలు మరింత ఉత్పన్నమవుతుందని ఏ జోన్‌లోని సిల్ట్‌ను ఆ జోన్లోనే తరలించేందుకు తగిన స్థలాలు చూసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు స్ధలాల ఎంపిక సాధ్యం కాదని జోనల్ కమిషనర్లు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలైన క్వారీ గుంతలు, ఇతర డంపింగ్ స్థలాలపై అధ్యయనం చేసేందుకు సమయం పడుతుందని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ ఏడాది మాత్రం జవహర్ నగర్‌కే సిల్ట్‌ను తరలించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది మాత్రం సిల్ట్‌ను జోనల్ లెవల్లోనే డంపింగ్ చేసుకునే అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యత మీదేనంటూ జోనల్ కమిషనర్లకు కమిషనర్ తేల్చి చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా.. 390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 55 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఏటా దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను వెలికితీస్తున్నారు.
నాలాల నుంచి వెలికితీసిన ఈ చెత్తను జవహర్ నగర్‌కు తరలిస్తున్న అధికారులు.. వచ్చే ఏడాది ఎక్కడకు తరలించాలన్న దానిపై ఆలోచనలో పడేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో చెత్త నిర్వహణ కేంద్రానికి స్థానికుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం కావడంతో దానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలోనే సిల్ట్‌ను తరలింపునకు అనువైన స్థలాలను జోనల్ లెవల్లో ఎంపిక చేయడం సవాల్‌గా లాంటిదేనని జోనల్ కమిషనర్లు చెబుతుండడం గమనార్హం. భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే..