Srinagar Colony | బంజారాహిల్స్, జూలై 15 : పరిశుభ్రతకు మారుపేరుగా ఉండే శ్రీనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతో అపరిశుభ్రత నెలకొంది. రోడ్లపై పేరుకుపోతున్న చెత్తాచెదారానికి తోడు ఫుట్పాత్లమీద వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చంటిమెస్ నుంచి రత్నదీప్ వైపునకు వెళ్లే ప్రధాన రహదారి మద్యలోని డివైడర్ మీద మొత్తం చెత్తాచెదారంతో పాటు చెట్లకొమ్మలు వేశారు. రెండునెలలుగా స్థానికులు ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ -17 శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక కాలనీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఫుట్‌పాత్‌లు మొత్తం చెట్లకొమ్మలతో నిండిపోయాయని, వీటిని తొలగించడం తమ పని కాదంటూ అధికారులు తప్పించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.