సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువ చేసే 170 కిలోల గంజాయితో పాటు ఒక వ్యాన్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం అబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన ఇస్మాయిల్ తురికి వృత్తిరీత్యా పొక్లెయిన్ ఆపరేటర్.
ఛత్తీస్‌ఘడ్, రాయపూర్‌లోని ఓ విద్యుత్ సరఫరా సంస్థలో పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్‌కు ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారుడు సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. గంజాయి రవాణా చేస్తే సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని సంతోష్ ద్వారా ప్రేరేపితుడైన ఇస్మాయిల్ డబ్బు కోసం గంజాయి స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్, మాండ్ల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు.
దీంతో 11నెలలపాటు జైలు శిక్ష అనుభవించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి విడుదలైన తరువాత తన స్నేహితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి పకడ్బందీగా గంజాయి స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే ఒడిశా నుంచి మహారాష్ట్రకు డీసీఎం వ్యాన్‌లో గంజాయి తరలిస్తుండగా శుక్రవారం రాత్రి పెద్ద అంబర్‌పేట వద్ద ముందస్తు సమాచారంతో మాటు వేసిన అబ్కారీ అధికారులు డీసీఎం వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వ్యాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాక్‌లలో పెద్ద ఎత్తున గంజాయి సంచులు బయటపడ్డాయి.
దీంతో ప్రధాన నిందితుడైన ఇస్మాయిల్‌తో పాటు పూణేకు చెందిన మహ్మద్ ఆసిస్రాజన్, శైలేంద్రకారత్, జీవన్ నానా నికిత్, వినయ్ ముకురే, ఒడిశాకు చెందిన గిరి లక్ష్మీనారాయణ భారీఖ్, ధర్మరాజు దొర, అమర్లను ఆబ్కారీ అధికారులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 170కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, ఎస్టీఎఫ్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు, ఎస్ఐ శివకృష్ణ, కానిస్టేబుళ్లు వేణు, శివప్రసాద్, మౌలా అలీ, భరత్ చంద్ర, దినేశ్ కార్తిక్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.