సిటీబ్యూరో: నకిలీ పత్రాలు, నకిలీ వ్యక్తులతో ఖాళీ ప్లాట్లను కొట్టేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. రమాదేవి, మాధురి.. తమ పేర్లపై ఉన్న ప్లాట్లకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, డెత్ సర్టిఫికెట్లు, తదితర డాక్యుమెంట్లన్నీ నకిలీవి తయారు చేసి నకిలీ వ్యక్తులతో ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటూ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్లాట్ల యజమానులు బతికి ఉండగానే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేసి, నకిలీ ఫ్యామిలీ మెంబర్లను స్పష్టించారు. నకిలీ డాక్యుమెంట్లతో అమాయకులపై మొదట ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ డాక్యుమెంట్‌ను మరొకరికి విక్రయించారు. మానకొండూరు పోలీస్‌స్టేషన్ ఏఎస్సై లింగయ్య గౌడ్ ఈ ముఠాను నడిపించాడు. అతడితో పాటు ప్రవీణ్‌రెడ్డి, సంపత్, కంబ్లీ దీపలు ముఠా సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. మరో కేసులో వేణు, వెంకట్‌రెడ్డి, జ్యోతి, ఇన్నయ్య తదితరులు ముఠాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.