సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): /ఎల్బీనగర్/చర్లపల్లి: గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించేలా పోలీస్ అధికారులు చూడాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. గురువారం ఎల్బీనగర్, మల్కాజిగిరి డీసీపీ జోన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల సిబ్బందితో ఆయన చైతన్యపురి రాజధాని ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, విధుల షెడ్యూల్‌ను వివరించారు. సబ్ ఇన్స్పెక్టర్లు వారి సెక్టార్లలో ఉన్న మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీలు ఇతర అసోసియేషన్లతో మాట్లాడి నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అవసరమయ్యే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెరువుల వద్ద ఇతర ఉరేగింపు సాగే సమయంలో అవాంతరాలు ఉంటే.. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనపడినప్పుడు వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ చెప్పారు.
అనంతరం చక్రీపురం సిరిగార్డెన్లో మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి ఆధ్వర్యంలో వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీపీ మహేశ్‌భగవత్ పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, డీసీపీలు సంప్రీత్ సింగ్, యాదగిరి, శ్రీనివాస్, ఏడీసీపీలు షమీర్, సలీమా, శివకుమార్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, పురుషోత్తం, బాలకృష్ణారెడ్డి, హరినాథ్, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.