సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 19న నిర్వహించే వినాయక నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాఫిక్ పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్, ఆర్అండ్బీ, విద్యుత్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రధాన నీటివనరు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 24 భారీ క్రేన్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన పలు చెరువులు, 25 కొలనుల వద్ద మొత్తం 300 క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. 100 మంది గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వాహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 10 పాయింట్లలో అందుబాటులో ఉంచడం జరిగిందని, వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్స్పెక్టర్లులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ పోలీసు, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా, వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్ వైజర్ లేదా ఎస్ఎఫ్ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించడం జరుగుతుందన్నారు.
శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పాటు గ్రేహ్యాండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్ళను నడపనున్నట్లు పేరొన్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మంత్రి తలసాని కోరారు.
అబిడ్స్, సెప్టెంబర్ 16 : నగరంలో వినాయక నిమజ్జనంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలు అభినందనీయమని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. నిమజ్జనం విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సమయానికి తీర్పు రావడం సంతోషకరమన్నారు. సిద్దంబర్బజార్లోని బాహెతిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్‌రావు మాట్లాడుతూ వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం సకాలంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం అనుకూల తీర్పునిచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఉత్సవ సమితి ప్రతినిధులు పటాకులు పేల్చి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు.