సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : ఈనెల 10వ తేదీ నుంచి మొదలయ్యే గణేశ్ ఉత్సవాలకు గ్రేటర్ సిద్ధమవుతున్నది. 10 రోజుల పాటు కొనసాగే వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా పోలీసు శాఖ , జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధానంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లపై సంబంధిత అన్ని శాఖల అధికారులు దృష్టిసారించారు. వినాయక చవితి 10 రోజుల ఉత్సవాలతోపాటు నిమజ్జనం ఏర్పాట్ల కోసం ఈసారి సుమారు రూ.13.50 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈసారి భారీ విగ్రహాలు మినహా చిన్న చిన్న విగ్రహాలను ఎక్కడికక్కడ స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్‌తో సహా 31 చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమయ్యే ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం నగర వ్యాప్తంగా 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు, జేసీబీలు వినియోగించనున్నారు. ఒక్క హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 55 పెద్ద క్రేన్లు (స్టాటిక్) ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ లైటింగ్, పకడ్బందీగా శానిటేషన్ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రధాన రహదారులతో పాటు వినాయక నిమజ్జన యాత్ర కొనసాగే దాదాపు 350 కి.మీల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా, వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధానంగా కరోనా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించారు. నిమజ్జన మార్గాల్లో శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచనున్నారు. నిమజ్జన మార్గాల్లో తాత్కాలిక టాయిలెట్లు, తాగునీటి ఏర్పాట్లు, వైద్య కేంద్రాలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించనున్నారు. నిమజ్జనం ఏర్పాట్ల నేపథ్యంలో క్రేన్ల అద్దె, నిమజ్జనం చివరి రోజు వరకు వాటిని వినియోగించుకునేందుకు అవసరమైన సిబ్బంది, తదితర ఏర్పాట్లకు దాదాపు రూ. 13.50 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
హుస్సేన్‌సాగర్, కాప్రా, చర్లపల్లి, నల్లచెరువు, నాగోల్, మన్సురాబాద్ పెద్ద చెరువు, సరూర్‌నగర్, మీర్ ఆలం ట్యాంక్, పల్లె చెరువు, పత్తికుంట, జంగమ్మెట్, రాజన్నబావి, ఎర్రకుంట, దుర్గం చెరువు, గోపి చెరువు, మల్కం చెరువు, గంగారం పెద్ద చెరువు, కొత్తకుంట, గురునాథం చెరువు, కైదమ్మకుంట, రాయసముద్రం, సాకి చెరువు, ఐడీఎల్, సున్నం చెరువు, హస్మత్‌పేట, అంబీరు చెరువు, వెన్నెల గడ్డ, పరికి చెరువు, లింగం చెరువు, కొత్త చెరువు, బండ చెరువు, సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద వినాయకుల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 6 : వినాయక చవితి మరో నాలుగు రోజులు ఉండగా, ఖైరతాబాద్‌లో ప్రతిష్టించిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి మండపం వద్ద గణేశ్ ఉత్సవ
కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గణపతి హోం నిర్వహించారు.