TCV | ఖైరతాబాద్, మే 15: ప్రత్యేక రాష్ట్రంలో నేటికీ తెలంగాణ సినిమాపై ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని తెలంగాణ సినిమా వేదిక స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక రాష్ట్ర కన్వీనర్ లారా, కోకన్వీనర్ మోహన్ బైరాగి, గౌరవ సలహాదారుడు ప్రఫుల్ రాంరెడ్డి తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
రాష్ట్రంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేరుకే ఉందని, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదన్నారు. కొందరు ఆంధ్ర సినీ పెద్దల చేతుల్లో థియేటర్లు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో థియేటర్ మాఫియా సాగుతోందన్నారు. 1993 అక్టోబర్ 4న మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (MAA) ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఉమ్మడిగా ఎందుకు కొనసాగుతున్నది ప్రశ్నించారు. ఫిలిం చాంబర్లు ఆంధ్రా, తెలంగాణ వేర్వేరుగా ఉండాలని, కానీ ప్రస్తుత చాంబర్లోఆంధ్రా పెత్తనం కొనసాగుతోందన్నారు.
తెలంగాణ సినిమాలకే ఇవ్వాలి..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గద్దర్ అవార్డులను తెలంగాణ సినిమాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆంధ్రా, తెలంగాణ సినిమా రంగాల విభజన జరగాలని, తెలంగాణ ఫిలిం చాంబర్లో వెంటనే మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడి సినిమా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సీనియర్ కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. తెలంగాణ సినిమా రంగంలో 24 క్రాఫ్టుల్లో ఈ ప్రాంతం వారే అధికంగా ఉండాలన్నారు.
చిన్న సినిమాలకు నెలకు 14 రోజులపాటు అన్ని థియేటర్లలో అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్‌కు నూతన భవనం నిర్మించాలన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా నిర్మించే చిత్రాలకు సబ్సిడీ ఇవ్వాలని, చిన్న సినిమాల నిర్మాణంలోనూ రాయితీ కల్పించాలన్నారు. తెలంగాణ సినిమా విభజన జరిగేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. సుల్తాన్ యాదగిరి, జైహింద్ గౌడ్, రఫీ, సురేశ్ రెడ్డి, విష్ణు కృష్ణ, మురళీధర్ దేశ్‌పాండే, పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి పాల్గొన్నారు.