శంషాబాద్ రూరల్: శంషాబాద్ నుంచి నర్కూడ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాజీ జడ్పీటీసీ సతీశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ సతీశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో అప్పటి మంత్రి కేటీఆర్ శంషాబాద్ నుంచి షాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 250 కోట్లతో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు.
ఆ రోడ్డు పనులను పూర్తి చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దాదాపు రెండేండ్ల నుంచి శంషాబాద్- నర్కూడ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డును తవ్వి కంకరవేసి వదిలేయడంతో దుమ్ముతో వాహనదారులు అవస్థలు పడుతున్నారన్నారు. నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆరెస్టు చేశారు. ఆందోళన చేసిన వారిలో మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి గౌస్‌పాషా తదితరులు ఉన్నారు.