రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : అవిశ్రాంత యోధుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. అక్షర సూరీడు.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు అశేష ప్రజానీకం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో రామోజీ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. కడసారి చూసేందుకు రాజకీయ, సినీరంగాల ప్రముఖులు, అభిమానులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, బంధువులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పత్రిక, సినిమా, సాహిత్య రంగాల్లో రామోజీరావు అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది.
అంతిమయాత్ర రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా సాగి ఉదయం 11 గంటలకు స్మృతివనానికి చేరుకుంది. అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. పోలీసుల గౌరవ వందనంతో అంతిమయాత్ర ప్రారంభం కాగా.. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, రాచకొండ సీపీ తరుణ్ జోషి దగ్గరుండి ఏర్పాట్లు చూశారు. అంత్యక్రియల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నియమించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ సాయిప్రసాద్, ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆర్సీ సిసోడియా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీరావు చితికి ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, నాయకుడు తీగల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.