హైదరాబాద్: తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లోని మెడికోవర్ హాస్పిటల్స్ (medicover hospitals) డాక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. చిన్న వయస్సులోనే పురుషాంగం కోల్పోయిన యువకుడికి దానిని పూర్తిగా పునర్నిర్మించారు. ఈ తరహా సర్జరీని తెలంగాణాలో తొలిసారి నిర్వహించిన ఖ్యాతిని ఆ వైద్యులు దక్కించుకున్నారు. సొమాలియాకు చెందిన 19 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ తర్వాత పురుషాంగానికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ప్రైవేట్ భాగాన్ని అతడు కోల్పోయాడు. ఈ సమస్య పరిష్కారానికి పలు దేశాల్లోని హాస్పిటల్స్‌ను ఆశ్రయించాడు. అయితే ఎలాంటి ప్రయోజనం కలుగలేదు.
కాగా, ఆ సొమాలియా యువకుడు చివరకు హైదరాబాద్‌లోని మెడికోవర్ హాస్పిటల్స్‌ను సంప్రదించాడు. ప్లాస్టిక్ సర్జన్లు అతడి పరిస్థితిని పరిశీలించారు. సీనియర్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అయిన డాక్టర్ ఏవీ రవికుమార్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ సంక్లిష్టమైన పురుషాంగ పునర్నిర్మాణ ప్రక్రియను అమలు చేశారు. పది గంటల పాటు మైక్రోవాస్కులర్ సర్జరీ నిర్వహించారు. రేడియల్ ఆర్టరీ ఫ్లాప్ ఉపయోగించి అతడి పురుషాంగాన్ని పూర్తిగా పునర్నిర్మించారు.
మరోవైపు తెలంగాణాలోనే తొలిసారి నిర్వహించిన ఈ అరుదైన సర్జరీతో ఆ రోగి సాధారణంగా మూత్ర విసర్జన చేసే సామర్థ్యం తిరిగి పొందినట్లు డాక్టర్ ఏవీ రవికుమార్ తెలిపారు. అలాగే పురుషాంగం ఇంప్లాంట్ వల్ల ఆ యువకుడు సాధారణ లైంగిక జీవితాన్ని గడపగలడని డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ చెప్పారు.
కాగా, చిన్నతనంలో ఇన్ఫెక్షన్ కారణంగా కోల్పోయిన పురుషాంగాన్ని తిరిగి పొందటంపట్ల సొమాలియా యువకుడి ఆనందానికి అంతులేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా తాను చాలా బాధతో జీవించినట్లు అతడు వాపోయాడు. అరుదైన ఈ సర్జరీ వల్ల తన గుర్తింపుతోపాటు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం తిరిగి పొందినట్లు తెలిపాడు. ఎవరికీ చెప్పుకోలేని ఏళ్ల నాటి తన సమస్యను పరిష్కరించిన మెడికోవర్ హాస్పిటల్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశాడు.