సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు..పూర్తయ్యే నాటికి ఉండటం లేదు. ప్రతి పనిలో 20 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ -ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నిర్మితమవుతున్న స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టు వ్యయం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పన్నులు, గడిచిన కాలంలో ధరల పెరుగుదల దృష్ట్యా రూ. 523.37 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 620కోట్లకు పెంచేశారు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఖజానాపై అదనంగా రూ. 96.63 కోట్ల భారం పడింది. అంతకు ముందు ఆర్టీసీ క్రాస్‌రోడ్ స్టీల్ బ్రిడ్జికి రూ. 139 కోట్ల అంచనా వ్యయం పెంచేశారు.
ఇలా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల నుంచి ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్ల వరకు అంచనాలు మారుతున్నాయి..ఇక్కడే నాణానికి మరో వైపు అన్నట్లుగా అసలు పనుల జాప్యానికి ఇంజినీరింగ్ వ్యవస్థ గాడి తప్పడమే. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో నాలుగు జోనల్లకు చెందిన ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) బాధ్యతలు ఒక్కరికే కేటాయించడం, మరొకరికి ఐదు విభాగాల చీఫ్ ఇంజినీర్ (సీఈ-ప్రాజెక్ట్స్-మెయింటెనెన్స్, హౌసింగ్, లేక్, అడ్మిన్) బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే పరిపాలనాధికారుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ వ్యవస్థలో నెలకొన్న లోపాలే ఖజానాపై భారం పడేలా చేస్తున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. కొందరు అధికారులు ఏజెన్సీల కొమ్ము కాస్తూ అంచనాలు పెంచేలా పరోక్ష సహకారం అందిస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేసే సరైన పర్యవేక్షణ లేకపోవడమే ప్రాజెక్టులు భారంగా మారుతున్నాయని పాలకమండలి సభ్యులు చెబుతున్నారు.
నిర్ణీత వ్యవధిలో..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల పనులు వాయువేగంతో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. కానీ గడిచిన ఏడాది కాలంలో ఎస్ఆర్డీపీ పనుల పురోగతిలో వేగం మందగించింది. ఈ నేపథ్యంలోనే శాస్త్రీపురం ఆర్వోబీ (రూ.71 కోట్లు), ఫలక్‌నుమా ఆర్వోబీ రూ.47.10కోట్లు, శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ స్టేజ్-2 రూ. 275కోట్లు, నల్గొండ క్రాస్‌రోడ్ స్టీల్ బ్రిడ్జి రూ. 370 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.620కోట్లకు పెరగడం గమనార్హం. ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్ రూ. 311 కోట్లతో చేపట్టగా, ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో 30శాతం మేర అదనంగా భారం ఖజానాపై పడే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారడం, టెండర్ల పిలుపు నుంచి సంబంధిత ప్రాజెక్టు పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోతున్నారు.