సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్ రూరల్ : ఎంసెట్-2023లో 1 నుంచి 10 వేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇస్తామని అనురాగ్ యూనివర్సిటీ సీఈవో ఎస్ నీలిమా తెలిపారు. అలాగే జేఈఈలో 1 నుంచి 25 వేల లోపు ర్యాంకులు సాధించిన వారికి కూడా 50 శాతం ఫీజు మినహాయింపు వర్తిస్తుందన్నారు. బుధవారం అనురాగ్‌సెట్-2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమాతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈవో మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన ఫ్యాకల్టీ బోధన చేయిస్తూ, అకడమిక్ వాతావరణంలో అనురాగ్ యూనివర్సిటీని నడిపిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ.. అనురాగ్ యూనివర్సిటీలో విదేశీ యూనివర్సిటీల స్థాయిలోనే విద్యాబోధన, ప్లేస్మెంట్ వంటివి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలను ఈ నెల 29 నుంచి వరుసగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అనురాగ్‌సెట్-23 ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. బుధవారం నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అడ్మిషన్ తీసుకున్న తొలి 500 మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామన్నారు.
వర్సిటీలో స్పోర్ట్స్ స్కాలర్షిప్లు..
అనురాగ్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్కాలర్షిప్లను కూడా అమల్లోకి తీసుకువచ్చామని వీసీ రామచంద్రం తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో మంచి నైపుణ్యాలు, సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులకు కూడా యూనివర్సిటీలో 100 శాతం ఫీజు మినహాయింపుతో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎన్‌సీసీతో పాటు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌కు విస్తరించాలన్న ఆలోచనతో యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ మహిమతి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఎగ్జామినేషన్ ముత్తారెడ్డి, వివిధ విభాగాల డీన్లు తదితరులు పాల్గొన్నారు.