అమీర్‌పేట్, జనవరి 7 : సుమారు 150 మంది నిరుపేదల కోసం ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ శిబిరం జరుగనున్నది. ఇందుకు సంబంధించి అమీర్‌పేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ ఆస్పత్రి ట్రస్టీలు విద్యాభూషణ్, ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గులాబ్‌రాణి, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దుర్గారెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం చివుకుల, ఆస్పత్రి టస్ట్రీ కమల్‌కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్‌ల్యాండ్స్) అధ్యక్షురాలు ప్రొఫెసర్ లక్ష్మీకుమారిలతో కలిసి వివరాలు వెల్లడించారు.
ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని, తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి 21న ఓల్డ్ మల్లేపల్లిలోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రహణం మొర్రితో వచ్చే వారికి స్క్రీనింగ్ ఉంటుందని, 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ప్లాస్టిక్ సర్జరీలుంటాయని వివరించారు. ఇప్పటి వరకు 4 వేలకు పైగా ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించామని, ఈ సేవా కార్యక్రమాల నిర్వహణలో సేవా భారతి తోడ్పాటు మరువలేనిదన్నారు. మరిన్ని వివరాలకు 9177254912, 9848241640లలో సంప్రదించాలని వారు సూచించారు.