ఆఫీసుకు వెళ్లే పని లేదు.. బాస్ గోల లేదు..
రెండు చేతులా సంపాదిస్తున్న ఫ్రీలాన్సర్లు
అనేక రంగాల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్న ఉద్యోగులు
కంపెనీలతో ఒప్పందానికి సోషల్ మీడియా కీలకం
సిటీబ్యూరో, మే 26 ( నమస్తే తెలంగాణ ): బాస్‌ల ఊసే ఉండదు. కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదు. నిర్ణీత సమయానికి ప్రాజెక్ట్ పూర్తిచేస్తే సరిపోతుంది… ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కల్చర్‌లో దొరికే సదుపాయాలు. ఇప్పుడు ఈ ట్రెండ్‌నే చాలా మంది ఉద్యోగులు ఫాలో అవుతున్నారు. ఇంట్లో ఉండే సంపాదిస్తున్నారు. కరోనా పరిస్థితులతో ఫ్రీలాన్సింగ్ కల్చర్‌కు డిమాండ్ పెరిగింది. గతంలో వీరంతా ఒకే రంగానికి చెందిన ఉద్యోగం చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమ ప్రావీణ్యం నిరూపించుకుంటున్నారు. సోషల్ మీడియా ఆధారంగా అనేక సంస్థలతో సంప్రదింపులు జరిపి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. హెల్త్, ఫుడ్, ఐటీ ప్రాజెక్టులు, యాప్ డిజైనింగ్, గేమింగ్ సహా వేర్వేరు రంగాల్లో పనిచేస్తున్నారు. టెక్నాలజీపై పట్టు వివిధ అంశాలపై అవగాహన ఉన్న వారు ఫ్రీలాన్సింగ్గా పనిచేస్తూ ఆదాయం గడిస్తున్నారు.
ఇదిగో ఫ్రీలాన్సింగ్..
వెబ్సైట్ డిజైనింగ్, టెక్నికల్ రైటింగ్, బ్లాగింగ్, అనువాదం, ఫొటోషాప్, డేటా ఎంట్రీ, వీడియో ఎడిటింగ్, ఈకామర్స్, మొబైల్ యాప్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, మార్కెటింగ్, బ్యానర్ డిజైన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కంటెంట్ రైటింగ్, జావా స్క్రిప్ట్, ట్రావెల్ నిపుణులు, ఫుడ్ బ్లాగర్, యాప్‌ల తయారీ, అనువాదం, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ కసహా అనేక రంగాల్లో అవకాశాలున్నాయి.
ఒక్క క్లిక్ చాలు..
ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లి..ఎవరినో కలవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్ చాలు సమస్త ప్రపంచ అవకాశాలన్నీ మీ ముందు సాక్షాత్కరిస్తాయి. అందుకోసం ఫ్రీలాన్సర్, అప్‌వర్క్ తదితర వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు వర్క్స్ కావాలనుకునే వారు, కంపెనీలు తమ వర్క్‌ను ఫ్రీలాన్సర్లకు అప్పజెప్పే వారు ఇలా అందరూ అందుబాటులో ఉంటారు. మనం అందులో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు 1800 విభిన్న రకాల కేటగిరీలలో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ 5.94కోట్ల మంది ఫ్రీలాన్సర్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారంటే ఫ్రీలాన్సింగ్‌కు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు వివిధ కంపెనీలు, వ్యక్తులు తమకు అవసరమయ్యే ఉద్యోగాలు సుమారు 2.15కోట్ల ఉద్యోగాలను సదరు వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఇలా అనేక మంది ఫ్రీలాన్సింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఉద్యోగం పోతుందనే బెంగలేదు
ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. ప్రాజెక్టులను నిర్ణీత సమయాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి వర్క్ చేస్తే యాజమాన్యాలు అంగీకరించవు. అయితే ఇదే ఫ్రీలాన్సింగ్‌లో అటువంటి భయం ఉండదు. మనకు నచ్చినట్టుగా ఉద్యోగం చేసుకోవచ్చు. వెబ్సైట్ డిజైనింగ్ డేటా ఎంట్రీ వంటి మార్గాల్లో కూడా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఫ్రీలాన్సర్లుగా మారిపోయారు.
ఫ్రీలాన్సర్కి డిమాండ్
కరోనాతో ఉద్యోగాల తీరు మారిపోయింది.ఉద్యోగాలు ఉంటాయనే గ్యారంటీ లేదు. అందుకే వారికున్న నైపుణ్యానికి మరింత పదునుపెడుతున్నారు. ఉద్యోగం చేసుకుంటూనే ఇతర కంపెనీలకు ఫ్రీలాన్సింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకొందరూ ఇంట్లో ఉంటూనే ఫ్రీలాన్సర్‌గా విధులు నిర్వర్తిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు.
–సత్య, ఐటీ నిపుణులు