బంజారాహిల్స్, ఫిబ్రవరి 26: మంచి జీవితం ఇస్తానని నమ్మించి వాట్సాప్ వీడియోకాల్స్‌లో నిఖా చేసుకుని వీడియో కాల్లో అసభ్యకరంగా ఉన్న వీడియో, ఫొటోలు తీసుకున్నాడు. ఏడాది గడిచినా తనతో కాపురం చేయకపోవడంతో పాటు వీడియోలు, ఫొటోలు బయటపెడ్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తుండటంతో పాటు మొదటి భార్యతో కలిసి బెదిరింపులకు దిగాడు. పెండ్లి పేరుతో మోసం చేసి వేధింపులకు గురిచేసిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మొదటి భార్య పైన బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో సౌదీలో ఉంటున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టోలీచౌకి సమీపంలోని ఏజీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న మహిళ(36) భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో నివాసముంటుంది. ఆమెకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వాట్సాప్‌లో అరేబియాలోని రియాద్ నగరంలో నివాసం ఉంటూ పౌల్టీ్ర వ్యాపారం చేస్తున్న మహ్మద్ అబ్దుల్ ఆహాద్(39) పరిచయమయ్యాడు.
తనది పాతబస్తీలోని మొఘల్‌పుర అని, తన మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో పెండ్లి కోసం చూస్తున్నానంటూ ఆమెను నమ్మించాడు. పెండ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కొనివ్వడంతో పాటు కాపురానికి తీసుకువెళ్తానని చెప్పాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ఆమె గత ఏడాది ఏప్రిల్‌లో వాట్సాప్ వీడియో కాల్లో టోలీచౌకిలోని ఖాజీ సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. మరుసటిరోజున ఆన్లైన్లో నిఖా నమోదు చేశారు. ఈ పెండ్లికి సంబంధించిన బాధ్యతలు తన తరపున చూస్తాడని బహుదూర్పురాకి చెందిన అబ్దుల్ రజా అనే వ్యక్తిని పవర్ ఆఫ్ అటార్నీగా అబ్దుల్ ఆహాద్ నియమించాడు.పెండ్లయినప్పటి నుంచి వాట్సాప్‌తో పాటు జంగీ యాప్ ద్వారా మహిళతో వీడియో కాల్స్ మాట్లాడిన అహాద్ ఆమెతో నగ్న వీడియోలు తీసుకోవడం, కోరిన విధంగా ఫొటోలు తెప్పించుకున్నాడు. త్వరలోనే తాను ఇండియా వచ్చి కాపురానికి తీసుకెళ్తానంటూ నమ్మించాడు.
దాంతో అతడు చెప్పినట్లు వీడియో కాల్స్‌లో ప్రవర్తించింది. కాగా నిఖా సందర్భంగా అహాద్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న వ్యక్తి కూడా ముఖం చాటేశాడు. దీంతో అనుమానం వచ్చి వాకబు చేయగా..అప్పటికే ఆహాద్కు రెండు పెండ్లీలు అయ్యాయని, మొదటి భార్య అమాతుల్లాతో కలిసి ఉంటున్నాడని తేలింది. మొదటి భార్య అమాతుల్లాకు కాల్ చేయగా.. తన భర్తను వదలిపెట్టాలని, లేకుంటే ఆయనతో చేసిన వీడియో కాల్స్, ఇతర పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. ఈ విషయం ఆహాద్కు చెప్పగా.. తాను కూడా సరదాగా పెండ్లి నాటకం ఆడానని సమాధానం ఇచ్చాడు. అతడి గురించి విచారణ చేయగా.. ఇలా పెండ్లి పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు తేలింది.దీంతో బాధితురాలు బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్85,318(4), 351(2) తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.