తప్పుడు పత్రాలతో స్థలం ఇప్పిస్తామం టూ రూ.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.71లో నివాసం ఉంటున్న వెన్నా సత్యనారాయణ.. స్నేహితులు వెన్న రమణమూర్తి, లక్ష్మారెడ్డి, శ్రీహరితో కలిసి శంకర్పల్లి మండలం, కొండకల్ గ్రామంలోని లహరీ గ్రీన్‌పార్క్ లేఅవుట్లో స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ద్వారా మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పుట్టపాక శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. సదరు స్థలానికి సంబంధించి యజమాని కంచర్ల రమణ అనే మహిళతో పాటు ఆమె కొడుకు దుర్గా ప్రసాద్‌తో తనకు ఒప్పందం ఉందంటూ కొన్ని పత్రాలు చూపించడంతో పాటు స్థలాన్ని విక్రయిస్తానంటూ వారికి అగ్రిమెంట్ చేశాడు. దీనికోసం రూ.5.05కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అతన్ని నిలదీయగా ముఖం చాటేశాడు. దీంతో బాధితుడు సత్యనారాయణ బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.