బంజారాహిల్స్, అక్టోబర్ 5: పెట్టుబడి పేరుతో మోసం చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని సిద్ధార్థ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న ఈశా అగర్వాల్ రెండేండ్ల క్రితం పంజాగుట్ట నాగార్జునహిల్స్‌లోని మాక్స్లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏజెంట్‌గా చేరేందుకు వెళ్లింది. అక్కడ సేల్స్‌మేనేజర్‌గా పని చేస్తున్న గోపి సిక్దర్‌తో పరిచయం ఏర్పడింది. అయితే తనకు కొద్దిగా డబ్బులు ఇస్తే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి లాభాలు ఇస్తానని నమ్మించాడు. ముందుగా రూ.50 వేలు తీసుకొని కొన్ని రోజుల తర్వాత లక్ష ఇచ్చాడు. మరోసారి రూ.5 లక్షలు తీసుకొని రూ.7 లక్షలు ఇచ్చాడు.
దీంతో పూర్తి నమ్మకం కుదరగా రూ.35 లక్షలు ఇస్తే ఏడాదిలో రూ.50 ఇస్తానని నమ్మబలికిన గోపి అనంతరం మొహం చాటేశాడు. సంస్థలో ఉద్యోగం మానేయడంతో పాటు పైసలు అడిగినప్పుడల్లా బెదిరింపులకు దిగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ నెల 4న డబ్బుల విషయం అడిగేందుకు ఈశ గోపిని ఇంటికి పిలిచింది. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరుగగా గోపి ఈశ జట్టుపట్టుకొని పక్కకు లాగేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు గోపిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.