బంజారాహిల్స్,అక్టోబర్ 5: పాన్ బ్రోకర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ కబీర్‌నగర్‌లో నివాసం ఉంటున్న బొబ్బా వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా నకిలీ ఆభరణాలను తయారు చేయించి వాటిపై హాల్ మార్క్ వేసి బస్తీల్లో ఉంటున్న పాన్ బ్రోకర్ల వద్ద తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఇందిరానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన పాన్బ్రోకర్లవద్ద వెంకట్‌రెడ్డి పలు రకాలైన వస్తువులను తనఖా పెట్టాడు.
అతడు ఇచ్చిన వస్తువులను పరిశీలించగా చాలా వరకు నకిలీ అని తేలింది. సుమారు రూ.50లక్షల దాకా ఈ విధంగా అప్పులు తీసుకొని మోసానికి పాల్పడ్డాడని సుమారు 20మంది పాన్ బ్రోకర్లు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు బొబ్బా వెంకట్‌రెడ్డిపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.