బంజారాహిల్స్, సెప్టెంబర్ 30: స్నేహితుడితో కలిసి ఊటీలో హోటల్ పెడుదామని యజమాని వద్ద నగదును చోరీ చేసి పారిపోయిన కారు డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌రావు (41) బోరబండ ఎన్ఆర్ఆర్పురంలో నివాముంటూ.. జూబ్లీహిల్స్ రోడ్ నం 10(సి)లో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరునెలల నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఊటీలో హోటల్ పెట్టాలని స్నేహితుడు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన విజయ్(54)తో కలిసి ప్లాన్ వేశాడు. శ్రీనివాస్‌రావు తన యజమాని వద్ద నుంచి డబ్బులు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న యజమాని సంతోష్‌రెడ్డి తన సోదరుడి వద్ద రూ.55 లక్షల నగదు తీసుకుని కోకాపేట ప్రాంతంలో ఉన్న వ్యాపారి లచ్చిరెడ్డికి ఇచ్చి రావాలంటూ చెప్పాడు. డబ్బులు తీసుకున్న శ్రీనివాస్.. కొంత దూరంలో కారును వదిలేసి ఆటోలో విద్యానగర్‌కు వెళ్లాడు. అక్కడున్న స్నేహితుడు విజయ్‌తో కలిసి ఖమ్మం వెళ్లాడు.
అక్కడ రాంబాబు అనే స్నేహితుడికి రూ.2 లక్షలు ఇచ్చి దాచాలంటూ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు రైల్లో ఏలూరు వెళ్లి.. ట్యాక్సీని మాట్లాడుకొని ఊటీ చేరారు. బాధితుడు సంతోష్‌రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా శ్రీనివాస్‌రావు వెళ్లిన మార్గాన్ని గుర్తించారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కనుక్కుంటూ.. ఖమ్మం, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల మీదుగా వారిని వెంబడించారు. డ్రైవర్ శ్రీనివాస్‌రావు, అతడి స్నేహితుడు విజయ్ ఊటీకి చేరిన 10 గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అక్కడకు చేరుకుని.. వారి కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని.. ఇద్దరి వద్ద నుంచి రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.