సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రభు త్వ ఉద్యోగులు, సస్పెండ్ అయిన ఉద్యోగులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ఓ పాల వ్యాపారిని మంగళవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన బంగారు సురేశ్‌కుమార్ చారి అలియాస్ నాగేశ్వర్రావు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నం.10లో నివాసముంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు.
గతంలో పలు జిల్లాల్లోని రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. అయితే అధికంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో వివిధ అవినీతి ఆరోపణల్లో సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేశాడు. తిరిగి ఉద్యోగం వచ్చేలా చేస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయసాగాడు. ఈ విధంగా మోసాలకు పాల్పడుతూ 9 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా బుద్ధి మారలేదు.
తాజాగా ఈ నెల 3న నాగేశ్వర్ రావు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేశాడు. తాను తెలంగాణ సెక్రటేరియట్ జీఏడీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు జిల్లాలో సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, వారి పేర్లు, ఫోన్ నంబర్లతో పాటు ఉద్యోగ వివరాలను తనకు వెంటనే పంపాలని ఆదేశించాడు.
అదికూడా తన వాట్సాప్ నంబర్‌కు పంపాలని తెలిపాడు. ఇది నిజమని నమ్మిన కలెక్టరేట్ ఉద్యోగి వివరాలన్నీ పంపించాడు. దీంతో ఆ లిస్టులోని నంబర్లకు ఫోన్ చేసిన సురేశ్‌కుమార్ మీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని, పదోన్నతి కూడా కల్పిస్తానని.., ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు అధికారులతో మాట్లాడానని తెలిపాడు. ఇది జరగాలంటే తాను చెప్పిన నంబర్‌కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాలని సూచించాడు.
దీనిపై అనుమానం వచ్చిన సదరు అధికారి ఈ విషయాన్ని కలెక్టరేట్లోని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాగేశ్వర్ రావును మంగళవారం అరెస్టు చేశారు.
విచారణలో అతడిపై నాంపల్లి, సీసీఎస్ హైదరాబాద్, కరీంనగర్ వన్, టూటౌన్, విశాఖపట్నం, కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ పీఎస్‌లలో కేసులు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను యూ-ట్యూబ్ ద్వారా సేకరించి వాటి ద్వారా వారికి గాలం వేస్తాడు. అంతేకాకుండా అమాయకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్రభుత్వ హౌజింగ్ స్థలాలు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసినట్లు విచారణలో తేలింది.