సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ‘సార్ సలాం…నమస్తే సార్’…అంటూ నల్లగండ్ల ప్రాంతంలో నిర్మాణమవుతున్న ప్రభుత్వ డబుల్ బెడ్రూం ప్రాంతంలో కారు దిగిన వ్యక్తిని చూసి.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది హడావుడి చేశారు. అంతలోనే కొందరు అతడి చుట్టుముట్టారు..‘ఇవే మీకు అలాట్ అయిన ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇండ్లు. మీకు ఏ దిక్కున కావాలో చూసుకోండి. ఏది బాగుందో.. నాకు చెబితే.. అది ఇచ్చేస్తాన’ని వారితో అన్నాడు. సంతోషంలో వారంతా ఆ భవనంలోకి వెళ్లారు. సొంతింటి కల సాకారం అయిందని మురిసిపోయారు.
ఇక్కడ సీన్ కట్ చేస్తే… తామంతా మోసపోయామని తెలుసుకొని.. సుమారు వంద మంది బాధితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ‘డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రభుత్వ ఉన్నతాధికారికే డబ్బులు ఇచ్చాం కదా..ఎందుకు ఇలా జరిగింద’ని ఆవేదన చెందారు. ఇలా అమాయకులను బుట్టలో వేసుకోవడానికి బొమ్మిడం కుమార్‌బాబు తనకు తాను ఓ పెద్ద అధికారిగా చలామణి అయ్యేందుకు సృష్టించిన సీన్ ఇది. శుక్రవారం సైబరాబాద్ ఎస్వోటీ, సనత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా కుమార్‌బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రమేశ్‌బాబు, అలియాస్ రవివర్మ పేర్లతో చలామణి అయిన ఇతగాడు ప్రదర్శించిన తెలివి తేటలు, హంగు ఆర్భాటాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితులకు డబుల్ బెడ్రూం కేటాయిస్తానని ఇచ్చిన తేదీకి ముందు రోజు ఉదయం నల్లగండ్లలో నిర్మాణంలో ప్రాంతానికి కుమార్‌బాబు వెళ్లాడు. అందరు సెక్యూరిటీ గార్డులను పిలిచాడు. మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పి..తాను రాగానే కారు డోర్ తీసి.. అందరూ సెల్యూట్ కొట్టాలని..నమస్కారం పెట్టాలని.. సార్..సార్ అని పిలవాలంటూ.. ఒక్కో సెక్యూరిటీ గార్డుకు రూ. 1000 ఇచ్చాడు. తన కారు నంబర్, రంగును చూపించాడు. తాను అధికారినేనని కంగారు పడాల్సిన అవసరం లేదంటూ.. మీకు జీతాలు తక్కువగా ఉంటాయని, అందుకే డబ్బులు ఇస్తున్నానని నమ్మించాడు. దీంతో మరుసటి రోజు అతడి ప్లాన్ విజయవంతమైంది. అంతే…ఒకేసారి దాదాపు 100కు పైగా అమాయకులు అతడిని నమ్మి..ప్రభుత్వ డబుల్ బెడ్రూం వస్తాయని ఆశపడి.. సుమారు రూ. 1.80 లక్షల నుంచి 6 లక్షల వరకు కుమార్‌బాబుకు చెల్లించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన బొమ్మిడం కుమార్‌బాబుకు చేతులకు బంగారం ఉంగరాలు, కడియాలు, బ్రాస్లెట్స్, మెడలో గొలుసులను ధరించడం చాలా ఇష్టం. ప్రతి రెండు నెలలకు ఓ కారును మారుస్తుంటాడు. వాటిని సెకండ్ హ్యాండ్‌లోనే కొంటాడు. ప్రభుత్వ డబుల్ బెడ్రూంలు కేటాయిస్తానని అతనే ఓ పోస్టును సృష్టించుకున్నాడు. తెలంగాణ హౌసింగ్ బోర్డు పేరుతో డిపార్ట్మెంట్..ఏఈ హౌసింగ్ సొసైటీ తెలంగాణ స్టేట్ సెక్రటేరియేట్ పేరుతో ఓ ఐడీ కార్డును తయారు చేసుకుని.. దానిపై ప్రభుత్వ లోగోను కూడా ముద్రించుకున్నాడు. తానే ఈ ఇండ్లను కేటాయిస్తానని నమ్మించేందుకు అమాయకులకు రశీదులను కూడా ఇచ్చాడు. ఆ రశీదులో కూడా తెలంగాణ హౌసింగ్ సొసైటీ, బ్లాక్-బీ, సెక్రటేరియేట్ హైదరాబాద్ అని వివరించాడు. తాను ఉన్నతాధికారినంటూ..గ్రీన్ పెన్‌తో వాటిపై సంతకం కూడా పెట్టాడు.
చివరకు ఏకంగా ప్రభుత్వ డబుల్ బెడ్రూం పట్టాను రూపొందించి.. అందులో డబ్బులు చెల్లించిన వారి ఫొటో పెట్టి దానిపై అప్రూవల్, ప్రభుత్వ ముద్రలను కూడా వేసి నిండా ముంచేశాడు. ఓ సందర్భంలో టెలిఫోన్ ఎంక్వయీరీ అంటూ అమాయకులను సంబురంలో ఉంచాడు. ‘మీ ఆదాయం ఏడాదికి చాలా ఎక్కువగా ఉంది…మీకు ఇండ్లు.. రాదు మేనేజ్ చేయాలంటే ఇంకా డబ్బులు కావాల’ని వసూలు చేశాడు. ఇలా బొమ్మిడం కుమార్ బాబు దాదాపు అరకోటికి పైనే వసూలు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు 61 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎవరైనా దందా చేస్తే.. వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.