ఖైరతాబాద్, ఆగస్టు 13 : సోషల్ మీడియాలో పరిచయమైన యువతి, యువకుడు ప్రేమించుకుని సహజీవనం కూడా చేశారు. పెండ్లి చేసుకోవాలని కోరగా యువకుడు ముఖం చాటేయడంతో ఆ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్మిన్ ఎస్సై కౌశిక్ కథనం ప్రకారం… సోమాజిగూడకు చెందిన యువతి, కొండాపూర్‌కు చెందిన ఆదిత్య టిండర్ సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచమయ్యారు. అది ప్రేమగా మారగా, ఇద్దరు కలిసి తిరిగారు. యువతి గత జనవరిలో మాస్టర్ ప్రోగ్రాం కోసం విదేశాలకు వెళ్లింది. వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతున్నది. విదేశాల్లో ఉండాల్సిన అవసరం లేదు.. బెంగళూరులో ఆస్తులు ఉన్నాయంటూ నమ్మబలికి ఆమెను ఇండియాకు రప్పించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మణికొండలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని కలిసి ఉన్నారు. తర్వాత బంజారాహిల్స్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే, గతనెల 30న యువతి తండ్రి పుట్టిన రోజు. ఆమె సోమాజిగూడలోని పుట్టింటికి వెళ్లింది. ఇదేక్రమంలో ఆదిత్య బెంగళూరుకు వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. నాలుగు రోజుల కిందట అతడిని కలిసిన యువతి, పెండ్లి చేసుకోవాలని అడుగగా అతడు నిరాకరించాడు. ఆదిత్య మోసం చేశాడని గ్రహించిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.