సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ఓ బిల్డర్ను మభ్యపెట్టి..రూ. 86 లక్షలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాపల్లి గ్రామానికి చెందిన ఓ బిల్డర్ ఇండ్లు కట్టి విక్రయిస్తుంటాడు. అతడికి సెప్టెంబర్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. పెట్టుబడికి భారీ లాభాలంటూ..అందులో వివరించారు. బిల్డర్ స్పందించడంతో అతడిని ఓ గ్రూపులో చేర్పించారు. అందులో మిగతా గ్రూపు సభ్యుల నుంచి ‘నేను ఈ రోజు 3 లక్షలు పెట్టుబడి పెడితే.. 5 లక్షలు లాభం వచ్చింది.
దీంతో నేను అత్యాధునిక ఎలక్ట్రిక్ సామగ్రిని కొన్నా. మరొకరు.. రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టా..రూ. 75 లక్షలు సంపాదించా…ఓ ఇల్లు కొన్నా’.. .ఇలా మెసేజ్లు వస్తుండడంతో బిల్డర్ ఆసక్తి చూపాడు. మొదట రూ. 50 వేలు పెట్టుబడిగా పెట్టాడు. రూ. 1915 లాభం వచ్చింది. నమ్మి సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు మొత్తం రూ. 86.80 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. రూ. 3 కోట్ల లాభం వచ్చిందని అతడికి కేటాయించిన వెబ్సైట్ పేజీలో కనిపించింది.
విత్ డ్రా ఆప్షన్ లేకపోవడంతో వాట్సాప్లో సంప్రదించాడు. ‘నీవు ఇంకా పెట్టుబడి పెట్టు.. మరిన్ని భారీ లాభాలు వస్తాయి. లేదంటే.. అకస్మాతుగా ఆపేస్తాం.. ఆ డబ్బులు కూడా రావు’ అని మభ్యపెట్టారు. ఇలా బాధితుడు మొత్తం 17 లావాదేవిల్లో నగదును జమ చేశాడు. మోసపోయానని గ్రహించి.. శనివారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిల్డర్ బదిలీ చేసిన నగదు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లోని బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లినట్లు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.