సిటీబ్యూరో, అగస్టు 8(నమస్తే తెలంగాణ): క్యాసినోలో జూదానికి అలవాటు పడి సైబర్ మోసగాడిగా మారిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..ఖమ్మం జిల్లా చెన్నారం గ్రామానికి చెందిన నాగరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. జూదంతో ఆర్థికంగా నష్టపోయాడు. కష్టాలను అధిగమించేందుకు ఆన్లైన్లో ప్లాట్లు, వ్యవసాయ స్థలాలను విక్రయిస్తానని నమ్మించి లక్షలాది రుపాయాలను కాజేశాడు. ఓఎల్ఎక్స్, 99 ఎకర్స్.కామ్, ఇతర సోషల్ మీడియా వేదికలు, క్లాసిఫైడ్స్లలో స్థలాల అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలను చూసి.. వారికి ఫోన్లు చేసి జిరాక్స్ పత్రాలను తీసుకుంటాడు. తర్వాత శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యాలయాలను నిర్వహిస్తున్న నిర్వాహకుల నంబర్లను సేకరిస్తాడు. వారికి యజమానుల నుంచి తీసుకున్న పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించి.. తనకు డబ్బు అత్యవసరంగా అవసరముందని, ప్లాటును తక్కువ ధరకు విక్రయిస్తానని నమ్మిస్తాడు. వారు ఇచ్చిన టోకెన్ నగదును నేరుగా స్థలం యజమానికి పంపించే విధంగా ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత నాగరాజు మిగతా నగదును తీసుకునేందుకు మాయ మాటలు చెప్పి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ అని నమ్మించి లక్షలాది రూపాయలు తీసుకుని బోల్తా కొట్టిస్తాడు. ఇలా మోసాలకు పాల్పడిన నాగరాజును ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో మూడేండ్లుగా అతడు సుమారు 10 మందికి టోకరా వేశాడని తేలింది.