సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి.. తమ స్నేహానికి గుర్తుగా బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించి యువతికి రూ.1.25 లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే… నైనలోయ అనే యువతికి, ఇన్‌స్టాగ్రామ్‌లో మైకెల్ ఫ్రాంక్లిన్ అనే పేరుతో సైబర్‌నేరగాడు పరిచయం అయ్యాడు. కొన్ని రోజులు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. దీంతో స్నేహానికి గుర్తుగా బంగారు వజ్రాలు, లక్ష పౌండ్లు పంపిస్తున్నానంటూ నమ్మించాడు. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం, మీ పేరుపై పార్సిల్ వచ్చింది.. దానికి క్లియరెన్స్ లేదంటూ రూ.1.25 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసమని గుర్తించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో లోన్ ఏజెంట్‌గా అవకాశం ఇస్తామంటూ ప్రియాంక అనే మహిళకు సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేసి రూ.79 వేలు వసూలు చేశారు. ఆ తరువాత 20 మందికి లోన్ ఇప్పించాలంటూ, ఒక్కొక్కరి నుంచి రూ.1600 వసూలు చేయాలంటూ సూచించడంతో ఆమె అదే విధంగా చేసింది. ఇలా మొత్తం రూ.1.12 లక్షలు చెల్లించడంతో, నేరగాళ్లు సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు.