జీడిమెట్ల, జనవరి 16: స్క్రాప్ దుకాణాల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడుతున్న నలుగురు నిందితులను జీడిమెట్ల, బాలానగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గురువారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేశ్‌కుమార్, బాలానగర్ ఏసీపీ హన్మంతరావు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్, డీఐ కనకయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజులతో కలిసి వివరాలను వెల్లడించారు. సుభాష్‌నగర్ డివిజన్ రాంరెడ్డినగర్‌లో గోపిరెడ్డి, బాలకృష్ణ అనే వ్యక్తి స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నాడు.
రోజు మాదిరిగానే బాలకృష్ణ ఈనెల 9వ తేదీన రాత్రి 8 గంటలకు గోదాం గేటుకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూసేసరికి గేటు గోదాం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. గోదాంలో ఉన్న రెండు క్వింటాళ్ల కాఫర్ వైర్‌తోపాటు లోపల ఉన్న టాటా ఏసీ ట్రాలీ వాహనం కనిపించలేదు. దీంతో బాలకృష్ణ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 150 సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ఈ చోరీలకు పాల్పడింది కాలపత్తర్‌కు చెందిన సయ్యద్ ఫెరోజ్ (31), మహమ్మద్ అలాం(26), అస్లాం ఖాన్(42), రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ గఫూర్(46)గా గుర్తించారు.
గురువారం ఉదయం వీరిని గాజులరామారం చౌరస్తాలో అనుమానంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించి విచారించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7.64 లక్షల నగదు, ఒక టాటా ఏసీ ట్రాలీ వాహనం, ఒక టన్ను కాఫర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరికి సహకరించిన మరో వ్యక్తి సోహెల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో సయ్యద్ ఫెరోజ్‌పై 2011లో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో, మహ్మద్ అల్లాంపై 2023లో హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్నది. వీరిద్దరూ పాత నేరస్తులు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీసీఎస్ బాలానగర్, జీడిమెట్ల పోలీసులను డీసీపీ అభినందించారు.